సినిమా చూసి రిక్షా ఎక్కిన కనకదుర్గమ్మ.. 1955లో విజయవాడలో యదార్థ సంఘటన

Telugu Box Office

విజయవాడ కనకదుర్గమ్మకు పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా కొలువై ఉండేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుందని చెబుతుంటారు. దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి అమ్మవారి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది. ఈ కోవలోనే 1955లో జరిగిన యదార్థ గాథ ఇది..

1950 కాలంలో విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. కాయ కష్టం చేసుకుంటూ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవాడు. 1955లో ఏఎన్నార్, వహీదా రెహ్మాన్ జంటగా నటించిన ‘రోజులు మారాయి’ సినిమా విడుదలైంది. రిక్షా కార్మికుడైన వెంకన్న రాత్రివేళ మారుతి టాకీస్ వద్ద ఉండేవాడు. చివరి ఆట చూసిన ప్రేక్షకులెవరైనా రిక్షా కావాలని అడిగితే వారిని ఎక్కించుకుని గమ్యస్థానంలో దించేవాడు. ఈ ఏడాది ఓ రోజు అర్ధరాత్రి ఆట ముగిసిన తర్వాత వెంకన్న ఎప్పటిలాగే మారుతి టాకీస్‌ వద్ద నిలబడి ఉన్నాడు.

అప్పుడు ఓ పెద్దావిడ ఎర్రటి చీర ధరించి నుదుటిన పెద్దబొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలని అతడు అడగ్గా ఇంద్రకీలాద్రి వద్ద దించమని చెప్పింది. వెంకన్న రిక్షా తొక్కుతుండగా ఆ పెద్దావిడ అతడితో మాట కలిపింది. ‘రాత్రి వేళ మొత్తం చీకటిగా ఉంది.. దుర్గమ్మ ఈ సమయంలో గ్రామ సంచారానికి వస్తుందని విన్నాను. నీకు భయం వేయడం లేదా?’ అని అడిగింది. దానికి సమాధానంగా.. ఆవిడ మా తల్లి… అమ్మ దగ్గర బిడ్డలకు భయమెందుకు? అని ఢిల్లీ వెంకన్న సమాధానమిచ్చాడు. ఇంద్రకీలాద్రి వద్దకు రాగానే రిక్షా ఆపిన వెంకన్న.. ఏ ఇంటికి వెళ్లాలమ్మా? అని వెనక్కి తిరిగి చూడగా ఆ పెద్దావిడ కనిపించలేదు. దీంతో అతడు మెట్ల వైపు చూడగా ఆవిడ పైకి నడుచుకుంటూ కనిపిస్తుంది. డబ్బులివ్వకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా అని రిక్షావాడు అడగ్గా.. డబ్బులు నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. దీంతో అతడు తలపాగా తీసి చూడగా… అందులో బంగారు గాజు, రూ.10ల నోటు కనిపించాయి. వాటిని తీసుకుని వెంకన్న మెట్లవైపు చూడగా ఆవిడ అదృశ్యమైంది.

దీంతో తన రిక్షా ఎక్కింది.. అమ్మలగన్నఅమ్మ.. కనకదుర్గమ్మే అని నిర్ధారించుకున్న వెంకన్న.. అమ్మా అంటూ వెర్రికేకలు వేయడం ప్రారంభించాడు. దీంతో నిద్రలేచిన చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని ఏం జరిగిందని అడగ్గా.. అసలు సంగతి చెబుతాడు. ఈ విషయం బ్రాహ్మణ వీధిలో ఉండే అమ్మవారి ఉపాసకుల చెవిన పడింది. వారు ధ్యానం చేసి వచ్చింది కనకదుర్గమ్మే అని నిర్ధారించారు. ఈ సంఘటన అప్పటి ‘ఆంధ్రకేసరి’ అనే వార్తాపత్రికలో గాజు ఫోటోతో సహా ప్రచురితమైంది. దుర్గమ్మ రాత్రివేళల్లో నగరంలో సంచరిస్తుటుందని బెజవాడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ వార్త కొంతకాలంగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Share This Article