అలీ అబ్దుల్ కలాంగా హాలీవుడ్ ను భారత గడ్డపై దింపిన భగీరథుడు జగదీష్ -కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

హాలీవుడ్ దిగ్గజాలను భారత గడ్డపై దింపి, తన కథలతో ఇండో- అమెరికన్ సినిమా ఒప్పందాలను కుదుర్చుకున్న భారతీయ హాలీవుడ్ యువ దర్శకుడు జగదీష్ దానేటిపై కేంద్ర ప్రసార, సమాచార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్ లో ప్రత్యక్షంగా కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని ఆయన కొనియాడారు. లాస్ ఏంజిల్స్, అమెరికాకు చెందిన పింక్ జాగ్వర్స్ ఎంటర్ టైన్ మెంట్, ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత జానీ మార్టిన్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో జగదీష్ దానేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న అబ్దుల్ కలాం బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంత్రి జవదేకర్ నిన్న ఢిల్లీలో ఆవిష్కరించారు. పీపుల్స్ ప్రెసిడెంట్ గా భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కలాం బయోపిక్ ఆవిష్కరణలో పాలు పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కలాం ప్రాజెక్టుకూ, భారత దేశంలో వారు తలపెట్టిన ఇండో హాలీవుడ్ ఫిల్మ్ వెంచర్స్ కూ భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. తెలుగులో బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించి 41 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటులు మహమ్మద్ అలీ 1111 చిత్రంగా అబ్దుల్ కలాం బయోపిక్ తో హాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ కలాం గారి పాత్ర పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హాలీవుడ్ లో నటుడిగా అడుగు పెట్టే అవకాశమిచ్చిన దర్శకుడు జగదీష్ కు రుణపడి ఉంటానన్నారు.

????????????????????????????????????

హాలీవుడ్ దిగ్గజం జానీ మార్టిన్ మాట్లాడుతూ జగదీష్ దానేటిని కథల గనిగా అభివర్ణించారు. జగదీష్ చెప్పిన ఐదు కథలు తనను ఎంతగానో ఆకర్షించాయని, ఈ ఇండో అమెరికన్ చిత్రాల నిర్మాణంలో భాగస్వామి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పింక్ జాగ్వర్స్ ఎంటర్ టైన్ మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సువర్ణ పప్పు మాట్లాడుతూ ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల ఫిల్మ్ ఫండ్ తో ఈ ఇండో అమెరికన్ చిత్రాల నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. జగదీష్ దానేటి రచన, దర్శకత్వంలో రాబోతున్న చిత్రాలను భారత దేశంలోని ఐదు ప్రముఖ నగరాలలో ప్రకటించనున్నట్లు తెలిపారు. భారత దేశంలో ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ టెక్నాలజీ, మీడియా పవర్ హౌసెస్,
తద్వారా ఆగ్ మెంటెడ్ రియాలిటీ , వర్ట్యువల్ రియాలిటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జగదీష్ దానేటి మాట్లాడుతూ ఈ నెల 16 వరకు జరుపుతున్న భారత పర్యటనలో హాలీవుడ్, ఇండో అమెరికన్ ఫిల్మ్ ప్రాజెక్టులుగా నిర్మితమవుతున్న ఐదు చిత్రాల వివరాలను ప్రకటిస్తామన్నారు. అబ్దుల్ కలాం గారి బయోపిక్ కి దర్శకత్వం వహించటం భారత కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియజేసే బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

????????????????????????????????????


ఈ కార్యక్రమంలో హాలీవుడ్ నటి లిలియన్ రేవ్, బాలీవుడ్ దర్శక నిర్మాత మధుర్ భండార్కర్, బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రామచంద్రరావు, శ్రీమతి కళ్యాణి (జాయింట్ సెక్రటరీ, ఫిల్మ్స్, ఐ అండ్ బి మినిస్ట్రీ), పింక్ జాగ్వర్స్ భారత ప్రతినిధులు అల్లం సైదా రెడ్డి, ఎస్. నాగాచారి పాల్గొన్నారు.
jagadeesh daneti

APJ Abdul Kalam Biopic Poster Launch Press Release