Happy Friendship Day: స్నేహమేరా జీవితం.. ఫ్రెండ్స్ లేని జీవితం వ్యర్థం

‘మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. అలాగే మంచి స్నేహితుడు లైబ్రరీతో సమానం’ అని పెద్దలు చెబుతారు.. “నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వు.. కానీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు, “మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.” ఇలా ఎన్నో సామేతాలు స్నేహం గొప్పతనాన్ని చాటిచెబుతుంటాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బంధువులను దేవుడు నిర్ణయిస్తాడు.. కానీ స్నేహితులని మాత్రం మనమే ఎంపిక చేసుకుంటాం.. అందుకే జీవితంలో ఒక్క మంచి స్నేహితుడు ఉన్నా చాలంటారు. మన పురాణాల్లో శ్రీకృష్ణుడు – కుచేలుడు, దుర్యోధనుడు – కర్ణుడు స్నేహానికి ప్రతీకగా నిలిచారు. నేడు ప్రజలందరూ స్నేహితుల దినోత్సవం(ఆగస్టు నెల తొలి ఆదివారం) జరుపుకుంటున్నారు.. అసలు స్నేహితుల దినోత్సవం ఎందుకు..? ఎక్కడ..? ఎలా? పుట్టింది..? ఏ ఏ దేశంలో ఎప్పుడు సెలబ్రేట్‌ చేసుకుంటారో తెలుసుకుందాం..

సాధారణంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు… స్నేహం విలువతెలిపే కార్డులు, బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.. అయితే, 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి.

నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్‌ వ్యూహాలతో మొదలైంది. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అంతే కాదు హాల్‌మార్క్‌ గ్రీటింగ్‌ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్‌ హాల్‌ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్‌ కార్డులు మార్కెట్లోకి పంపారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇక, 1997 లో యునైటెడ్ నేషన్స్ “స్నేహం” యొక్క ప్రపంచ అంబాసిడర్ “విన్నీ ది పూ”. నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు, వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ 1958లో పరాగ్వేలో జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు దానిని పాటించడం మొదలుపెట్టాయి. 2011లో ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. మరోవైపు, అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20వ తేదీన నిర్వహిస్తుండగా.. భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాలు అయితే, ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి..

ఈ సృష్టిలో.. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న లాంటి బంధాలను ఒక మనిషి సృష్టించుకోలేడు.. కానీ, తనస్నేహితులను మాత్రం తనే ఎంచుకుంటాడు.. ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. తప్పు చేసినప్పుడు మందిలించడమే కాకుండా ఆపదలో రక్షిస్తూ వారికి దారి చూపే వాడే నిజమైన స్నేహితుడు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహమే అంటే అతిశయోక్తి కాదు. స్నేహితులు అనే వారు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకుని ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు.

కొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను, సమస్యలను ఆత్మీయ స్నేహితులతో మోహమాటం లేకుండా షేర్‌ చేసుకుంటారు. అలాంటి స్నేహాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయకూడదు.. కానీ, ఇలాంటి రోజులు.. వారిలో మరింత ఉత్సాహాన్నే నింపుతాయి.. సెలబ్రేట్‌ చేసుకోవడానికి మరో రోజును అదనంగా ఇస్తాయనే చెప్పుకోవాలి.

క‌మ్మనైన ప‌దం స్నేహం

స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు…. ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. కాని ఒక్కోసారి స్నేహం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందరినీ స్నేహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది. ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.

స్నేహితుల దినోత్సవ శుభాంకాక్షలు