అగ్ని లింగేశ్వరుడి నిలయం… అరుణాచలం, అబ్బురపరిచే గిరి ప్రదక్షిణ

ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్‌మాండ్‌లో యజమాన లింగం.

తమిళనాడులోని అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనని చెబుతారు.

పురాణ గాథ..
పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం పెరిగి కలహానికి దారితీసిందట. ‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట. వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట.

బ్రహ్మకు శివుడి శాపం

ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట. ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట.

‘మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూ లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ. ఆ తర్వాత అగ్ని రూపం పర్వతంగా మారింది. అదే అణ్ణామలై. శివుడికి వున్న అనేక నామాల్లో అణ్ణాల్ అనే పేరుకూడా ఒకటి. అణ్ణాల్ అంటే అగ్ని, ప్రకాశం తదితర అర్ధాలున్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండూకలిసి అణ్ణాల్ మలై, కాలక్రమేణా అణ్ణామలై అయింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవసూచకం. సాక్షాత్తూ శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవచిహ్నం తిరు ముందు చేరి తిరువణ్ణామలైగా ప్రసిధ్ధిపొందింది.

శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరివల్ల సాధ్యం కాదని, పర్వత పాదంలో అర్చా స్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా, శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మిచవలసినదిగా బ్రహ్మ, విష్ణులు దేవ శిల్పి మయుణ్ణి కోరారు. మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్య తీర్ధాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. ఇది అప్పటి సంగతి. తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం వున్న ఆలయం భక్తులను తరింపచేస్తోంది.

పరమ సత్యమైన క్షేత్రం

అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి.. ఏ ఆలయాలు ఉండాలి.. ఏ పూజలు చేయాలి.. అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాల భైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అబిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పాతాళ లింగ కూడా ఉంటాయి. అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుతిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారని చెబుతారు.

అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది. అందుకు సంబంధించి కొన్ని కథలూ ప్రచారంలో ఉన్నాయి. తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని అమ్మణి అమ్మన్‌ అనే మహిళ కట్టించారట. పరమశివుడి అనుగ్రహం వల్ల యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతీ ఇంటికి వెళ్లి ‘గోపురం కడుతున్నాం దానం చేయండి’ అని అర్థించేవారట. డబ్బులు లేవు అని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి.. అందులో ఎంత సొమ్ము ఉన్నదీ చెప్పేసేవారట. దీంతో భయపడి విరాళం ఇచ్చేవారని వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతుంటారు.

గిరి ప్రదక్షిణ
అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది, చేయాల్సినది గిరి ప్రదక్షిణ. ప్ర- పాప సంహారం, ద- కామ్య సిద్ధి, క్షి-జన్మ రాహిత్యం, ణ-జ్ఞాన మార్గంలో ముక్తి. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కి.మీ. దీనిని చెప్పులు లేకుండా చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునేవారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కనుక దీనిని సుదర్శనగిరి అని కూడా అంటారు. అరుణాచలం ఒక బ్రహ్మానందనిలయం. కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు. కొండ అంతా నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు, సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం వుండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా వుంటుంది.

గిరి ప్రదక్షిణను శ్రీ రమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గణేశ ఆలయం, అగస్త్యతీర్థం, ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగ, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరుతి లింగ, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్ర మఠం, ప్రతిధ్వనిమండపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం, ఈశాన్య లింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శోద్రిస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి ఆలయం మీదుగా కొనసాగిస్తారు. వీటితో పాటు కొండపై ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాదతీర్థం, గురు నమశ్శివాయ సమాధి, రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమాలను దర్శించుకోవచ్చు.

అరుణాచలం ఇలా చేరుకోవచ్చు..
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తిరువణ్ణామలైకి 4-5 గంటల ప్రయాణం. తిరుపతి నుంచి రైలు సర్వీసులు ఉన్నాయి. తిరువణ్ణామలై రైల్వేస్టేషన్‌ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు, ఆటోలు ఉంటాయి. బస్టాండ్‌కు దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది. అరుణాచలేశ్వరాలయం నుంచి రమణాశ్రమం 2 కి.మీ. దూరం ఉంటుంది.

ఆలయ దర్శన వేళలు
తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం.కు వరకూ ఆలయ ప్రవేశం ఉంటుంది. తిరిగి సాయంత్రం 4గం.కు తెరుస్తారు. రాత్రి 9గం.కు మూసివేస్తారు. పౌర్ణమిరోజున రాత్రివేళ అందరికీ దర్శనమయ్యే వరకూ ఆలయం తెరిచే ఉంచుతారు.