వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు

Telugu Box Office

సకల దేవతగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలి పూజ గణనాధునికే. ఆయన అనుగ్రహాం పొందితే అన్ని కార్యం జయమవుతుంది. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

పార్వతీ చంద్రుని శపించిన సమయంలోనే సప్తఋషులు తమ భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని త్వజించారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వల్లే ఋషి పత్నులు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవిని శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడి ఆవు పాలను పితుకుతుండగా పాత్రలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందోనని చింతించాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు అనే రాజు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు తనకు ఆ మణిని ఇవ్వమని సత్రాజిత్తును కోరాడు. దీనికి సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. తనపై ఉన్న నిందను పోగొట్టుకోడానికి మణిని వెదుకుంటూ అడవులకు వెళ్లిన జాంబవంతుడితో యుద్ధం చేసి తిరిగి దానిని సత్రాజిత్తుకు అప్పగించాడు.

శాస్త్రీయ దృక్పథం ఇది..
సాధారణం వినాయక చవితిని చాంద్రమానంలోని ఆరో నెలలో జరుపుకుంటాం. అంటే ఆగస్టు లేదా సెప్టెంబరులో ఈ పండుగ వస్తుంది. అయితే భాద్రపద శుద్ధ చవితి ముందు రోజు, మర్నాడు కూడా చంద్రుని చూడరాదు. నాలుగో రోజైన చవితిని వృద్ది చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు. అదే సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటాయి. ఈ సమయంలో భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రోజున చంద్రుని చూడరాదని పురాతన భారతీయులు పేర్కొన్నారు. దీన్ని ఓ మూఢనమ్మకంగా కొందరు పేర్కొంటున్నా వెనుకున్న శాస్త్రీయ దృక్పథం మాత్రం ఇదే.

Share This Article