హైదరాబాద్‌లో ఈ క్షేత్రాలు తప్పక సందర్శించాల్సిందే..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటంతో ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రార్ధనాలయాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ చారిత్రక నగరంలో అనేక హిందూ దేవాలయాలూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని కొన్ని ముఖ్య దేవాలయాల సమాచారం మీకోసం…

బిర్లా మందిర్
హైదరాబాద్ పర్యాటకంలో ప్రముఖంగా చూడదగ్గ ఆలయాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. పదేళ్ల పాటు కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది.

ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ లో ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయం నిర్మించబడడంతో దీనిని బిర్లా మందిర్ అని పిలుస్తారు. బిర్లా మందిర్ పేరుతో దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో వీరు ఆలయాలను నిర్మించారు.

సంఘీ టెంపుల్
హైదరాబాద్‌లో సందర్శించాల్సిన మరో అద్భుతమైన ఆలయం సంఘీ టెంపుల్. ఇది హైదరాబాద్‌ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఉంది. ఈ దేవాలయ పవిత్ర రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీవెంకటేశ్వర స్వామి. ఇక్కడి వెంకన్న విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతిరూపమని ప్రతీతి. ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అనేక చిన్న ఆలయాలు కొలువై ఉన్నాయి. పరమానందగిరి కొండపై ఉన్న సంఘీ ఆలయాల సమూహం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ ఆలయానికి వెళ్లడానికి కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. సంఘీ టెంపుల్‌‌కు సమీపంలోనే ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ఉంది.

జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి

హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేక పాహిమాం.. అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే ఇప్పటి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం.

చిలుకూరు బాలాజీ ఆలయం

హైదరాబాద్‌కు 23 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం ఉంది. అక్కడే కొలువై ఉన్నాడు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. ఆయన్ని అందరూ చిలుకూరు బాలాజీ అని పిలుస్తుంటారు. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. వారాంతాల్లో అయితే ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. విదేశాలకు వెళ్లేవారు చాలామంది వీసా కోసం చిలుకూరు బాలాజీకి మొక్కులు కడుతుంటారు. అందుకే ఆయన్ని ముద్దుగా వీసా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ముందుగా కోరికను మొక్కు కొని 11 ప్రదిక్షణలు చేస్తారు. ఆ కోరిక తీరిన తరువాత 108 సార్లు ప్రదిక్షణలు చేస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఎక్కడా హుండీ అనేది ఉండదు. అంతేకాకుండా స్వామివారి దర్శనానికి ధనిక, పేద అధికార తారతమ్యాలు ఉండవు. అందరు ఒకేవరుసలో నిలబడి దర్శనం చేసుకోవాలి.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ సమీపంలోని బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం కొలువై ఉంది. ఇక్కడి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే అమ్మగా భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది. మంత్ర శాస్రంలో ప్రధానమైన దశమహావిద్యలలో చిన్న మస్తాదేవి ఒకరు. ఆ చిన్నమస్తదేవియే పరశురాముని తల్లి రేణుకాదేవిగా అవతరించింది. ఆ రేణుకాదేవియే నేడు కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతుంది. ఇలా అమ్మవారి రూపాలలో బాలా త్రిపురసుందరి దేవి ఒకరు. ఆ తల్లిని భక్తులు బాలా, బాలాంబిక, బాలాకాంబిక అని పిలుస్తుండేవారు. ఆ బాలికాంబీయే బల్కమ్మగా, ఆ అమ్మ కొలువై ఉన్న ప్రాంతం బల్కమ్మ పేటగా పిలవబడుతూ అది నేటి బల్కంపేటగా మారిందని పూర్వీకులు చెబుతుంటారు.

ఈ ఎల్లమ్మ దేవత బావిలో భూమి ఉపరితలం నుండి సుమారు 10 అడుగుల దిగువన శయనరూపంలో తూర్పుములాగా చూస్తూ స్వయం భూమూర్తిగా భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. అమ్మవారి స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంది. ఈ బావి నుండి ఉధ్భవించే జల ఊట నిరంతరం ఉధ్భవించడం ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణము, ప్రతి ఆషాడమాసం చివరి ఆదివారం నాడు బోనాలు మరియు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడుతాయి. ఎల్లమ్మను దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆదివారం రోజు ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది.

కీసరగుట్ట ఆలయం
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలో కీసరగుట్ట అనే కొండపై నెలకొని ఉంది శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది అతిపురాతనమై శైవక్షేత్రం. ఆలయంలోనే కాకుండా వెలుపల కొండపై అనేక శివలింగాలు దర్శనమీయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. కీసరగుట్టపై ప్రతిష్ఠించేందుకు శివలింగాన్ని తీసుకురావాలని శ్రీరాముడు తన భక్తుడైన హనుమంతుడికి చెబుతాడు. అయితే ఆంజనేయుడు ముహూర్త సమయానికి రాకపోవడంతో రాముడు మరొక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు. అయితే తాను తెచ్చిన లింగాన్ని కాకుండా వేరేది ప్రతిష్ఠించడంతో హనుమంతుడు అలుగుతాడు. దీంతో రాముడు.. హనుమంతుడిని బుజ్జగిస్తూ ఈ క్షేత్రం భవిష్యత్తులో కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదిస్తాడు. అనంతరం హనుమంతుడు తెచ్చిన లింగాల్లో ఒక దాన్ని స్వామివారి వామ భాగంలో ప్రతిష్ఠించాడు. అదే శ్రీ మారుతీ కాశీ విశ్వేశ్వర లింగమని భక్తులు చెబుతుంటారు. ఈ శైవక్షేత్రం హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కీసరగుట్టకు బస్సు సౌకర్యం కలదు.

అష్టలక్షి ఆలయం
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో కొత్తపేటలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఈ ఆలయం కోఠి నుంచి 8 కి.మీ, సికింద్రాబాద్ నుంచి 14కి.మీ.ల దూరంలో ఉంది. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దాని చుట్టూ మరో ఏడు గర్భాలయాలు ఉన్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ, వరద ముద్రలో దివ్యాలంకార శోభితులై భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంకా మిగతా ఏడు గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధ్యానలక్ష్మి, శ్రీవిజయలక్ష్మి, శ్రీవీరలక్ష్మి, శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వలన స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని, అష్టైశ్వర్యాలు సిద్డస్తాయని శాస్త్ర వచనం.

పూరీ జగన్నాథ్ ఆలయం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పూరీ జగన్నాథ ఆలయం ఉంది. ఈ దేవాలయం దేశంలోని ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయాన్ని పోలి ఉండటం విశేషం. అక్కడికి వెళ్తే నిజంగానే పూరీకి వచ్చామా అన్న భావన కలుగుతుంది. ఈ ఆలయంలో బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. నగర ప్రజలతో పాటు పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శించే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.

దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న సాయిబాబా ఆలయం భక్తులను ఆకర్షిస్తుంటుంది. షిర్డీలోని బాబా ఆలయాన్ని పోలి ఉండేలా ఇక్కడ నిర్మించడం విశేషం. అందుకే దీన్ని దక్షిణ షిర్డీగా పిలుస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నప్పటికీ ఈ గుడిని భక్తులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం వరకు చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు వేలాది మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా మారిపోయింది.