శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఇలా పూజించండి!

Telugu Box Office

నేటితో శ్రావణమాసం ప్రారంభమైంది. తొలిరోజే శుక్రవారం రావడాన్ని హిందువులు ఎంతో ప్రాశస్త్యంగా భావిస్తున్నారు. దీంతో లక్ష్మీదేవి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా తలిచి గౌరవిస్తారు.

శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుంది.

అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి. గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, దుర్గాష్టకం లేదా అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళి ప్రాప్తంతో పాటు సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారికి సమర్పించి నేతితో దీపం వెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.

Share This Article