Hyderabad: భాగ్యనగరం అందాలు చూడతరమా…

Telugu Box Office

హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ప్రత్యేకత గత నగరం. తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం.. హస్తకళలకు, పర్యాటకానికి ప్రసిద్ధి. నిజాం రాజుల రాచరికానికి ప్రతీకగా భాసిల్లిన భాగ్యనగరం.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ దూసుకుపోతోంది. పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో లేనిదంటూ ఏదీ లేదు.

దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌ను ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. అప్పట్లో భాగ్యనగరాన్ని ఏలిన 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తించబడ్డాడు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరొందిన కోహినూర్ వజ్రం కూడా హైదరాబాదులో బయటపడిందే. కొల్లూరు గనుల్లో లభ్యమైన ఈ డైమండ్ అప్పట్లో గోల్కొండ కోటకు తరలినట్లు చెబుతుంటారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచే ఈ నగరంలో ప్రఖ్యాతి కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

చార్మినార్:
హైదరాబాద్ యొక్క అతి ముఖ్యమైన సూచిక ‘చార్మినార్’. నాలుగు మినార్‌లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్ అని పిలుస్తారు. అయితే ఈ నిర్మాణంలో అడుగడుగునా చార్ దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ప్రసిద్ధి పొందింది. ఆర్కియాలజీ పరిశోధనల్లో చార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న నాలుగు మినార్‌ల ఎత్తులను నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా నాలుగుతో భాగించబడడం విశేషం.

1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు ఛార్మినార్ ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్‌ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ఈ చారిత్రక కట్టడం ఖ్యాతి కారణంగా దీని చుట్టు పక్కల ప్రదేశాలు చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు పొందాయి. వాహనాల కాలుష్యం కారణంగా ఈ కట్టడం రంగు మారుతుండడంతో దీని పరిరక్షణలో భాగంగా దీనికి 300 మీటర్ల వరకూ దూరం వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. ఈ ప్రదేశంలో కేవలం పాదాచారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కట్టడం హైదరాబాద్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గోల్కొండ కోట:
గోల్కొండ రాజ్యానికి 14-16 శతాబ్దాల మధ్య గోల్కొండ కోట రాజధానిగా ఉండేది. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోటను భారతదేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. ఈ కోట ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది చప్పట్ల ప్రదేశం. కోట ముఖద్వారం వద్ద ఉండే గోపురం కింద చప్పట్లు కొడితే ఆ శబ్ధం కోట పై భాగంలో కిలోమీటరు దూరం వరకూ వినిపిస్తుంది. ఆకస్మిక దాడుల నుంచి అప్రమత్తం కావడానికి పూర్వం దీనిని ఉపయోగించే వారు. ఈ కోటలోని వాతావరణం పర్యాటకులకు 12వ శతాబ్ధం నాటి కాలాన్ని పరిచయం చేస్తుంది. హైదరాబాద్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే గోల్కొండ కోట పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది.

చౌమహల్లా ప్యాలెస్:
18వ శతాబ్దం నాటికి చెందిన అద్భుతమైన చారిత్రక కట్టడం ‘చౌమహల్లా ప్యాలెస్’. హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేసిన ఐదో నిజాం పాలకుడు ఆసఫ్ జాహ్ వంశం యొక్క నివాస స్థలం ఇది. ఉన్నత స్థాయి సమావేశాలు, రాచరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి. పర్షియన్ భాషలో ‘చాహర్’ అంటే నాలుగు, అరబ్ భాషలో ‘మహాలత్’ అంటే సౌధం అని అర్ధం వస్తుంది. ఈ రెండు పదాల ద్వారా ఈ భవనానికి అప్పటి పాలకులు చౌమహల్లాగా నామకరణం చేసినట్లు తెలుస్తుంది. 14 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ లో చూపు తిప్పుకోనివ్వని ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. 2010లో యునెస్కో ఈ ప్యాలెస్‌ను సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. హైదరాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ ఉంది.

బిర్లా మందిర్:
హైదరాబాద్ పర్యాటకంలో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలో ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. 10 ఏళ్ల పాటూ కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయాన్ని నిర్మించడంతో దీన్ని బిర్లా మందిర్ అని పిలుస్తారు.

సాలార్ జంగ్ మ్యూజియం:
దేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియాల్లో ‘సాలార్ జంగ్ మ్యూజియం’ ఒకటి. ఈ మ్యూజియంలోని పురాతన వస్తువులు నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ III చేత సేకరించబడ్డాయి. పాలరాతి శిల్పాలు, ఏనుగు దంతాల కళాకృతులతో పాటు పర్షియా, ఈజిప్ట్, ఉత్తర అమెరికా, ఐరోపా, చైనా, బర్మా, నేపాల్, జపాన్ వంటి దేశాలకు సంబంధించిన లోహ కళాఖండాలు, తివాచీలు, సెరామిక్స్, బొమ్మలు, శిల్పాలు ఇక్కడ ప్రదర్శితమవుతాయి. దీంతో పాటు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన చిత్రాలు, మొఘలుల కాలం నాటి కత్తులు, బాకులు కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇటాలియన్ కళాకారుడు బెంజొని రూపొందించిన వీల్డ్ రెబెక్కా శిల్పం మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. మ్యూజియంలో అడుగుపెట్టిన పర్యాటకులు అక్కడి చారిత్రక సంపదను చూసి గొప్ప అనుభవానికి లోనవుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సందర్శకులకు అనుమతి ఇస్తారు.

ఫలక్‌నుమా ప్యాలెస్:
రాజదర్పం ఉట్టిపడే.. ఫలక్‌నుమా ప్యాలస్‌ను నిజాం నవాబులు నిర్మించలేదు. సర్ వికారుల్ ఉమ్రా దీనికి అసలు నిర్మాత.. ఇతను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు స్వయానా బావ. ఆయన సంస్థానానికి ప్రధానమంత్రి కూడా. 1884 మార్చి 3న ఫలక్‌నూమా ప్యాలెస్‌కు శంకుస్థాపన చేశారు. ఇండో-అరేబియన్ నిర్మాణ శైలిలో దీన్ని డిజైన్ చేశారు. ఈ ప్యాలస్ నిర్మాణం కోసం ఇటలీ నుంచి పాలరాయిని, ఇంగ్లాండ్ నుంచి చెక్కను తెప్పించడం గమనార్హం. అయితే వికారుల్‌ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడంతో ఆరో నిజాం 1897లో ఆయనకు రూ.60వేలు చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నారని చెబుతుంటారు. ఆ తర్వాత అది ఏడో నిజాం మనవడు బర్కత్ అలీఖాన్ ముకరంజాకు దక్కింది. 2000వ సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా ఫలక్‌నూమా ప్యాలెస్‌ను 30 ఏళ్లపాటు తాజ్‌ గ్రూప్‌‌కి అప్పగించారు. దీన్ని హోటల్‌గా మార్పులు చేసి 2010 నుంచి తాజ్ ఫలక్‌నుమాగా మార్చారు.

హుస్సేన్ సాగర్‌:
హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఉన్న మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించారు. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ సరస్సు అప్పట్లో నగరానికి మంచినీటి అవసరాన్ని తీర్చేది. కాలక్రమేణా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు దీనిలో చేరడంతో ఇప్పుడు మురికికూపంగా మారింది. అయినప్పటికీ హుస్సేన్‌సాగర్ పరిసరాలు పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటాయి. హుస్సేన్‌సాగర్‌లో మధ్యలో స్థాపించిన బుద్ధ విగ్రహం ఆ ప్రాంతానికి మరింత ఆకర్షణ తీసుకొస్తుంది. దీనికి అనుబంధంగా నిర్మించిన నెక్లెస్‌ రోడ్ నగర అందాన్ని మరింత పెంచింది.

హైటెక్ సిటీ:
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం హైటెక్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు కొనసాగుతున్న సమయంలో 1998 న‌వంబ‌ర్ 22న సైబ‌ర్ ట‌వ‌ర్స్‌ను అప్పటి ప్రధానమంత్రి అట‌ల్ బిహారి వాజ్‌పేయి చేతుల మీదుగా ప్రారంభించారు. కేవలం 14 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న సైబర్ టవర్స్‌లో దేశ, విదేశాలకు చెందిన ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొలువుదీరాయి. అంత‌ర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ ఎదగడంతో హైటెక్ సిటీ పాత్ర ఎంతో ఉంది. దీని కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏర్పాటై సైబరాబాద్ అనే మరో ప్రాంతం ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సాప్ట్‌వేర్ రంగంలో బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ ఎదగడానికి హైటెక్‌ సిటీయే కారణం.

ఉస్మానియా యూనివర్శిటీ:
నాటి హైదరాబాద్‌ సంస్థానం, బ్రిటిష్‌ ఇండియాలో అతిపెద్ద సంస్థానం. 1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటిగా చెబుతారు. ఎందరికో చదువులను ప్రసాదించి.. ఉన్నత స్థానాల్లో నిలబెడుతున్న ఉస్మానియా యూనివర్శిటీని ఏడో నిజాం 1917లో స్థాపించారు.

కాచిగూడ రైల్వేస్టేషన్:
కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో నిజాం ప్రభువులే నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌కు స్థానిక కాచి కులస్తుల జ్ఞాపకార్థంగా ‘కాచిగూడ’గా నామకరణం చేశారు. నిజాం కుటుంబీకులంతా ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేసేవారు. శిల్పశైలి పరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అందమైన స్టేషన్లలో ఒకటిగా కాచిగూడ స్టేషన్ నిలుస్తుంది. బయటి నుంచి చూస్తే రాజా ప్రసాదంలా కనిపించే కాచిగూడ రైల్వేస్టేషన్ భాగ్యనగర ప్రధాన చిహ్నాలలో ఒకటి.

‘పగడాల’ రాజ్యం:

దేశంలో పగడాల వ్యాపారానికి పెట్టింది పేరు హైదరాబాద్. ఇక్కడ విక్రయించే పగడాలను శ్రీలంక, ఇరాక్, చైనాల నుంచి దిగుమతి చేసుకుంటారు. చార్మినార్‌ వద్ద పత్తర్‌గట్టీ, మెడివల్ బజార్లు నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే, వీటిని కొనుగోలు చేసే ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ప్లాస్టిక్ పగడాలు కూడా అమ్మేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి.

అత్తర్లకు అడ్డా:
ఆల్కహాల్ కలవని ‘అత్తర్ల’కు భాగ్యనగరం ప్రసిద్ధి. అవి కూడా పాతబస్తీలోనే కొనుగోలు చేయాలి. ముస్లింలు వినియోగించే ఈ అత్తర్లకు భలే డిమాండు ఉంటుంది. ఇక్కడి డిమాండును దృష్టిలో పెట్టుకునే 19వ శతాబ్దంలో చాలామంది ‘అత్తర్‌వాలా’లు గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు వీరు ఏర్పాటు చేసినవే.

బిర్యానీ గుమగుమలు:
హైదరాబాద్ పేరు వింటే ఠక్కున గుర్తుకొచ్చేది.. బిర్యాని. ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఏలిన నిజాములు ఆహార ప్రియులు. ఈ నేపథ్యంలో స్పేసీగా, టెస్టీగా.. అనేక రకాల వంటకాలను వారు రుచి చూసేవారు. ఇవన్నీ మొగళుల కాలంలో ఉనికిలోకి వచ్చినవే. ఇక హలీమ్.. గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. ఇక్కడి హలీమ్‌కు భారీగా డిమాండు ఉంటుంది. హైదరాబాదులోని ప్యారడైజ్, బావర్చి, షాదాబ్, పిస్తా హౌజ్ తదితర హోటళ్లు బిర్యానీ ఫేమస్.

కేబుల్ బ్రిడ్జి
ఇటీవలే దుర్గం చెరువు మీద నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగరానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌ సిటీ కనెక్టివిటీలో భాగంగా దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ రెండేళ్లు పాటు శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశంలోనే కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి‌గా ఈ నిర్మాణం రికార్డు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డుల కెక్కింది.

వినోదానికి అడ్డా:
హైదరాబాద్ నగరం వినోదానికి పెట్టింది పేరు. షాపింగ్ మాల్స్ నుంచి మల్టిప్లెక్స్‌ల వరకు రోజూ ఎక్కడ చూసినా రద్దీగానే ఉంటుంది. నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, పబ్లిక్ గార్డెన్స్, పంజాగుట్ట సెంట్రల్, ప్రసాద్ ఐమ్యాక్స్. సుజనా ఫోరం మాల్, ఇనార్బిట్ మాల్, దుర్గమ్మ చెరువు, శిల్పారామం, … ఒకటేమిటీ నగరంలో అనేక ప్రాంతాలు పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. అటు చరిత్ర.. ఇటు ఆధునికతను ప్రతిబింబిచేలా హైదరాబాద్‌ నగరం దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే ఆకర్షిస్తోంది.

హైదరాబాద్‌లో చుట్టుపక్కల తప్పక సందర్శించాల్సిన మరిన్ని ప్రదేశాలు
నెహ్రూ జూపార్క్
ఎన్టీఆర్ పార్క్
కుతుబ్‌షాహీ టూంబ్స్
దుర్గం చెరువు
రామోజీ ఫిల్మ్‌ సిటీ
జల విహార్
వండర్ లా
మౌంట్ ఒపెరా
స్నో వరల్డ్
శిల్పారామం
కేబీఆర్ పార్క్
మక్కా మసీద్
సంఘీ టెంపుల్
పెద్దమ్మ గుడి
చిలుకూరు బాలాజీ ఆలయం

Share This Article