ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వెనుక ప్రాశస్త్యం ఏంటి?

Telugu Box Office

సాధారణంగా ఎవరు గుడికి వెళ్లినా ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. చాలామందికి అసలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నామో అసలు తెలియనే తెలీదు. ప్రదక్షిణలను రెండు రకాలుగా చెబుతుంటారు. మొదటిది ఆత్మ ప్రదక్షిణ, రెండోది ఆలయ ప్రదక్షిణ. అసలు ఈ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో ఇప్పుడు చెప్పుకుందాం. మనసులో ఉండే కోరికలు నెరవేరాలని దేవుడికి నమస్కారం పెడతాం. మన శక్తికొలది నైవేద్యం, కొబ్బరికాయ, అరటిపళ్లు, పూలు సమర్పిస్తుంటాం. అయితే దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు.

మనకి కనిపించే ‘సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఆగిపోతే ఏం జరుగుతుందన్నది ఊహించలేం. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది.

అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం ‘చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి ?

దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే, అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి అనే సందేహం తలెత్తుతుంది. ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, కొందరైతే 5, 9, 11సార్లు ప్రదక్షిణ చేయాలని చెబుతుంటారు. మరికొందరైతే దేవుడికి మొక్కు పేరుతో 108 సార్లు కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా ఎందుకు నిర్ణయించారనేది జవాబు దొరకని ప్రశ్న. ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. ఎవరకి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడమే ముఖ్యం. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేసినా.. రోడ్డు మీద నడిచినా ఒకటేనని గుర్తించుకోవాలి. అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకోగలం. అంతే కాదు అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణలోని ప్రధానోద్దేశ్యం. శ్రీ రమణ మహర్షి ‘ప్రదక్షిణం’ అన్న పదాన్ని విశ్లేషించారు. ‘ప్ర’ అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. ‘ద’ అంటే కోరికలన్నీ తీరడమని భావం. ‘క్షి’ అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. ‘న’ అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు.

పురాణ కథ
‘విశ్వమంతా తిరిగి త్వరగా ప్రదక్షిణ చేసి వచ్చిన వారికే గణాధిపత్యం” అని పార్వతీ పరమేశ్వరులు షరతు విధించినపుడు కుమారస్వామి మయూర వాహనంపైనెక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలు దేరాడు. మూషిక వాహనుడైన మహాగణపతి అలా వెళ్ళలేకపోయాడు. కానీ, తెలివిగా తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చిత్రంగా సుబ్రహ్మణ్యుడు వెళ్ళిన ప్రతి చోటా అంతకు మునుపే గణపతి వచ్చి వెళ్ళిన జాడలు కనిపించాయి. ముందుగా విశ్వాన్ని చుట్టి వచ్చిన వాడు వినాయకుడేనని నిర్ణయించి శివపార్వతులు, ఇతర దేవతలు ఆయనకే గణాధిపత్యాన్ని ఇచ్చారు. ఈ కథలో కుమారస్వామి, గణపతిలలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిష్కరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించాలన్నది సుబ్రహ్మణ్యుని బోధ. దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటే ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటే ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము, సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధి ప్రథమని చెప్పబడింది.

Share This Article