పాలపై అపోహలా..? ఈ విషయాలు తెలుసుకోండి

Telugu BOX Office

 


పాలు సంపూర్ణ ఆహారం. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన చక్కెర, ప్రొటీన్‌, కొవ్వులన్నీ దీంతో లభిస్తాయి. బియ్యంలో లేని లైసిన్‌, త్రియానైన్‌ అనే అమైనో ఆమ్లాలూ దీంతో భర్తీ అవుతాయి. చిన్నప్పటి నుంచే పాలు తాగటం అలవాటు చేసుకుంటే జీవితాంతం మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయినా మనలో చాలామందికి పాలపై ఎన్నో అపోహలు, భయాలున్నాయి. వీటిని తొలగించుకోవటం మంచిది.

పాలు జీర్ణం కావన్నది కొందరి భయం. ఆవు పాలలో ప్రొటీన్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి తేలికగానే జీర్ణమవుతాయి. గేదె పాలలో ప్రొటీన్‌ కాస్త ఎక్కువ. అయినా కూడా తేలికగానే జీర్ణమవుతాయి. ఘనాహారం తీసుకోలేనివారికి, ఆహారం సరిగా జీర్ణం కానివారికి పాలు, పెరుగు, మజ్జిగ ఎంతో మేలు చేస్తాయి.

ప్యాకెట్‌ పాలు మంచివి కావనేది నిజం కాదు. డెయిరీల్లో పాలను ముందుగానే శుభ్రం చేసి, కొవ్వుశాతం సమానంగా ఉండేలా చేస్తారు. కొద్దిసేపు అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేసి, ఆ వెంటనే చల్లబరుస్తారు. దీంతో బ్యాక్టీరియా వంటివేవైనా ఉంటే చనిపోతాయి. అంటే ప్యాకెట్‌ పాలు సురక్షితమన్నమాట. పోషకాలేమీ తగ్గవు.

పాలతో బరువు పెరుగుతామన్నది మరికొందరి అపోహ. మితంగా తీసుకుంటే వీటితో ఇబ్బందేమీ ఉండదు. అయితే చిక్కటి పాలు, గడ్డ పెరుగు వంటివి ఎక్కువెక్కువగా తీసుకుంటూ.. వ్యాయామం, శారీరక శ్రమ చేయకపోతే ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదం లేకపోలేదు.

పాలు తాగితే జలుబు చేస్తుందని అనుకోవటమూ భ్రమే. నిజానికి పాలతో రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. పాలతో వేడి చేస్తుందనీ కొందరు అనుకుంటుంటారు. ఇందులోనూ నిజం లేదు.

Share This Article
Leave a comment