‘ఆదిపురుష్’ టీజర్ డేట్ ఫిక్స్!

సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ , సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుంది.

చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అభిమానులందరూ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

‘ఆదిపురుష్’ టీజర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. రాముని జన్మస్థలం అయోధ్యలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మైదానంలో అక్టోబర్ 5న జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా నిర్వహకులు ఆహ్వానించారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రావణుడ్ని దహనం చేయాలని నిర్వహకులు కోరారట.

ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడనుండటంతోనే ఈ కార్యక్రమానికి పిలిచారని తెలుస్తోంది. గతంలో రావణ దహన కార్యక్రమానికి అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, జాన్ అబ్రహాం హాజరయ్యారు. కాగా, ‘ఆదిపురుష్’ ను భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 26న విడుదలయ్యే అవకాశం ఉంది.