HBD Suriya: వామ్మో… సూర్య ఆస్తి అన్ని రూ. కోట్లా?

Telugu Box Office

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఓ వైపు పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు పోలీసులు చేసే తప్పులు ఎత్తి చూపించే పాత్రలు(జైభీమ్) పోషిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాడు. అందుకే సూర్యను తమిళ ప్రేక్షకులతో సమానంగా తెలుగు వారు సైతం ఆరాధిస్తుంటారు. పాత్ర నచ్చితే హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించేందుకు సైతం అంటూ ఇటీవల ‘విక్రమ్‌’ మూవీ రోలెక్స్ పాత్రలో మెరిశాడు. తాజాగా వెలువడిన 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’ కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. జులై 23న 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సూర్య ఆస్తుల గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆయనకు ఎన్ని ఆస్తులున్నాయో ఓ లుక్కేద్దామా..

ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడైన సూర్య(Suriya) చెన్నైలో పుట్టి పెరిగాడు. కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. లయోలా కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1997లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘నందా’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ జ్యోతిక‌ను 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్య సోదరుడు కార్తి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు

ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సూర్య ఆస్తి, పాస్తుల విలువ రూ. 186కోట్లు. దక్షిణాదిలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఆయనొకరు. ఒక్కో సినిమాలో నటించేందుకు రూ. 20కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటాడని సమాచారం. బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి రూ.2కోట్లను పారితోషికంగా అందుకుంటాడట. ప్రమోషన్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, టీవీ కమర్షియల్స్ వంటి వివిధ మార్గాల్లో ఏడాదికి రూ. 30కోట్ల వరకు సంపాదిస్తాడని టాక్. సూర్యకు కార్లంటే అంటే చాలా ఇష్టం. అందుకే తన గ్యారేజీలో అనేక విలాసవంతమైన కార్లకు చోటిచ్చాడు. బీఎమ్ డబ్ల్యూ-7 సిరీస్, ఆడి-క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ ఎమ్ క్లాస్, జాగ్వార్ ఎక్స్‌జేఎల్ వంటి కార్లను సొంతం చేసుకున్నాడు.

Share This Article