ముగ్గురు హీరోల చేతిలో 16 సినిమాలు.. ఇది అరాచకం

Telugu Box Office

లాక్‌డౌన్ తెలుగు సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. షూటింగులు ఆగిపోవడం, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమాలు థియేటర్లు మూతపడటంతో నెలలపాటు ల్యాబ్‌కే పరిమితమయ్యాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నా టాలీవుడ్‌లో ఇదివరకటి సందడి లేదనే చెప్పాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టాలీవుడ్‌లో వరుసగా పెద్దపెద్ద సినిమాలు తెరకెక్కడం చర్చనీయాశంగా మారింది. సీనియర్, యంగ్ హీరోలు గతంలో కంటే స్పీడుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో రెండు మూడు కథలకు ఓకే చెప్పి, వాటినీ సమాంతరంగా పట్టాలెక్కించేందుకు అగ్ర కథానాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, మాస్ మహరాజ్ రవితేజ చేతిలోనే ఏకంగా 16 సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సినిమాల్ని ఒప్పుకోవడంలో ఈ ముగ్గురి రూటే సెపరేటు. ‘ఒకదాని తరవాత మరోటి’ అనే చందాన కథల్ని ఒప్పుకునే ఈ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం, అవి చిత్రీకరణ దశలో ఉండగానే మరిన్ని కథలు సిద్ధం చేసుకోవడం మార్కెట్‌ వర్గాలకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. 2022 ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కానుంది. ‘ఆచార్య’ పనులు ఇంకా మిగిలి ఉండగానే, ‘గాడ్‌ ఫాదర్‌’కి కొబ్బరికాయ కొట్టారు చిరు. ఇటీవలే ‘భోళా శంకర్‌’ పనులూ మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితమే బాబి సినిమాకి క్లాప్‌ కొట్టారు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఇవన్నీ సెట్స్‌పై ఉండగానే చిరంజీవికి మారుతి ఓ కథ వినిపించాడని టాక్‌ నడుస్తోంది. మారుతి కూడా ‘చిరంజీవిగారితో ఓ సినిమా ఉంటుంది. ఇప్పటికే లైన్‌ వినిపించేశా. పూర్తి స్థాయి కథని సిద్ధం చేయాలి’ అని చెప్పేశారు. మరోవైపు త్రివిక్రమ్‌ సైతం చిరుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే చిరంజీవి చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి.

మరోవైపు ‘క్రాక్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడు కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన ‘ఖిలాడి’ రిలీజ్‌ కి రెడీకాగా.. ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’… సినిమాలు లైన్‌లో ఉన్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా… కొత్త సినిమాలు ఒప్పుకోవడమే కాదు, సినిమా సినిమాకీ ఆయన పారితోషికం పెరుగుతూనే ఉందన్నది ట్రేడ్‌ వర్గాల టాక్‌.

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ కూడా బిజీగా మారిపోయారు. ఆయన ఊ అంటే చాలు అడ్వాన్సులు చేతిలో పెట్టడానికి అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత క్రేజీ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’‌తో ఈ సంక్రాంతికి రానున్నాడు. ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ పూర్తి చేయనున్నాడు. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్‌ K’పై కూడా భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్‌ నుంచి కూడా ప్రభాస్‌కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కొత్త కథలు వినిపించడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నా బిజీ షెడ్యూల్‌ వల్ల ప్రభాస్‌ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

Share This Article