దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో ‘వకీల్ సాబ్’ టీమ్

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది. మరోవైపు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా రావడంతో పవన్‌ కళ్యాణ్‌ కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దిల్‌రాజుకు కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు అందరిలోనే టెన్షన్ మొదలైంది.