డిసెంబర్‌లో కొత్త చిత్రాలతో ‘ఆహా’ సందడి..

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రేక్షకులకు వినోదాల విందు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నెలలో ఆడియన్స్‌కు మరిచిపోలేని వినోదాలను పంచనుంది. ఇందులో భాగంగా సినిమాలతో పాటు ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని వెబ్‌సిరీస్‌లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆహాకు మాత్రమే ప్రత్యేకంగా నిలిచే టాక్‌ షోలు, చెఫ్‌ షోలతో ఆకట్టుకుంటోన్న ఈ ఓటీటీ యాప్ తాజాగా కొత్త చిత్రాలతో రానుంది. డిసెంబర్‌లో ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానున్న సినిమాలు ఏంటంటే..

మంచి రోజులు వచ్చాయి
‘ఏక్‌ మినీ కథ’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంతోష్‌ శోభన్‌ హీరోగా, మెహరీన్‌ హీరోయిన్‌గా తెరెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి’ థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 3న ఆహా యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. మారుతి ఈ సినిమాకు దర్శకుడు.

పుష్పక విమానం..
డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయనున్న మరో చిత్రం ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్ఫక విమానం’. ఈ సినిమాకు విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమాకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఆనంద్‌ దేవరకొండ అద్భుత నటన, వినూత్నమైన కథాంశం, కామెడితో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇక ఈ సినిమా ఆహాలో డిసెంబర్‌ 10 నంచి స్ట్రీమింగ్ కానుంది.

అనుభవించు రాజా..
రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నవంబర్‌ 26న విడుదలైన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇట్స్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ..
ఆహా ఒరిజినల్‌ ఫిలిమ్‌ అయిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ప్రిన్స్‌, నేహా క్రిష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రానుంది. అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు అమెరికాలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు… అనుకోకుండా ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కోవడంతో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సేనాపతి..
రాజేంద్ర ప్రసాద్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న ఈ ఒరిజినల్‌ను ఆహా వేదికగా డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నారు. థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌గా ఉండనున్నట్లు సమాచారం. వీటితో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రిస్మస్‌ తాతా అనే సినిమాను కూడా ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా దీనిని విడుదల చేయనున్నారు. మొత్తానికి డిసెంబర్‌లో ఆహా ప్రేక్షకులను మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.