రివ్యూ: అంటే సుందరానికి

Telugu Box Office

టైటిల్‌ : అంటే..సుందరానికీ
నటీనటులు : నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌ హర్షవర్థన్‌, నదియా, రోహిణి తదితరులు
నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు:నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై.
దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ
సంగీతం : వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి
ఎడిటర్‌ :రవితేజ గిరిజాల
విడుదల తేది : జూన్‌ 10,2022

‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు నేచురల్‌ స్టార్‌ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్‌ కిక్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమా సినిమాకి తన పాత్ర, కథలో వేరియేషన్‌ ఉండేలా చూసుకుంటాడు. వరసగా యాక్షన్‌ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘అంటే.. సుందరానికీ’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో చూద్దాం.

సుంద‌ర ప్ర‌సాద్ అలియాస్ సుంద‌ర్ (నాని) బ్రాహ్మ‌ణ కుటుంబానికి చెందినవాడు. వారి వంశానికి ఏకైక మ‌గ సంతానం కావ‌టంతో కుటుంబంలో అంద‌రూ అత‌న్ని ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు. ఆ జాగ్ర‌త్త ఒక్కోసారి సుంద‌ర్‌కి ఇబ్బందిగా మారుతుంటుంది. సుంద‌ర్ స్కూల్ డేస్ నుంచి త‌న‌తో పాటు చ‌దువుకునే అమ్మాయి లీల (న‌జ్రియా న‌జీమ్‌)ను ఇష్ట‌ప‌డ‌తాడు. అది కాస్త ప్రేమ‌గా మారుతుంది. స్కూల్‌లో, స్నేహితుల ద‌గ్గ‌ర తన‌కు త‌గిన గుర్తింపు లేద‌ని బాధ‌ప‌డే లీల‌కి ఏదైనా డిఫ‌రెంట్‌గా చేస్తేనే అంద‌రిలో గుర్తింపు ద‌క్కుతుంద‌ని ఆమె తండ్రి చెబుతాడు. దాంతో ఆమె ఫొటోగ్రాఫ‌ర్ అవుతుంది.

సుంద‌ర్ ఓ ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలో ప‌నిచేస్తుంటాడు. ఇంట్లో సంప్ర‌దాయాల‌తో ఇబ్బంది పెడుతుంటారు. ఇంట్లో వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక త‌నే స‌ర్దుకుపోతుంటాడు. ఇక లీల విషయానికి వ‌స్తే.. ఆమె ఇంట్లో ఆమెకు అడిగిన‌వ‌న్నీ ఇచ్చినా పెళ్లి విష‌యంలో మాత్రం తండ్రి మాటే వినాల‌నే ష‌రతు ఉంటుంది. దీంతో మ‌తాలు, సంప్ర‌దాయాలు వేరుగా ఉండే ఈ ప్రేమికులు వారి ప్రేమ కోసం వారి కుటుంబ స‌భ్యుల‌తో అబద్దం ఆడుతారు. అయితే ఆ అబ‌ద్ద‌మే ఇద్ద‌రికీ చివ‌ర‌కు ఇబ్బందుల‌ను క‌లిగిస్తుంది. ఇంత‌కీ వారు ఆడే అబద్దాలు ఏంటి? వాటి వ‌ల్ల వారు ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. చివ‌ర‌కు ఇద్ద‌రూ కుటుంబాల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారా! అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రేమ‌, కుటుంబ బంధాలు, బాంధ‌వ్యాలు మిళిత‌మైన క‌థ‌ల‌తో సినిమాలను రూపొందించే స‌మ‌యంలో క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా.. దాన్ని ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఎలా చేశామనేది చాలా ముఖ్యం. ఈ కోవ‌లో సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో వివేక్ ఆత్రేయ ఒక‌రు. ఆయ‌న తొలి రెండు చిత్రాలు మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఈ విష‌యాల‌ను మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న అంటే సుంద‌రానికీ! అనే సినిమాను కూడా మ‌న అంద‌రికీ తెలిసిన క‌థ‌తోనే తెర‌కెక్కించాడు. ఓ బ్రాహ్మ‌ణ యువ‌కుడు.. క్రిస్టియ‌న్ అమ్మాయి ప్రేమించుకుంటారు. ఇద్ద‌రూ త‌మ ప్రేమ‌ను గెలిపించుకోవడం ఎలాగ‌నేదే సినిమా సింపుల్ క‌థాంశం. అయితే వివేక్ ఆత్రేయ.. సినిమాలోని పాత్ర‌ల‌ను, వాటి బేస్‌గా అల్లుకున్న స‌న్నివేశాల‌ను ఎంట‌ర్‌టైనింగ్ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఇలాంటి క‌థాంశంను తెర‌కెక్కించేట‌ప్పుడు దాన్ని వెండితెర‌పై ప్రేక్ష‌కులు మెచ్చేలా పండించే హీరో ఎంతో అవ‌స‌రం. సుంద‌ర్ పాత్ర‌లో నానిని చూసిన‌ప్పుడు త‌ను త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేర‌నేలా పాత్ర‌లో త‌ను ఒదిగిపోయారు. ఒక వైపు కుటుంబంలో జోతిష్యాలు, హోమాలు అంటూ ఇబ్బంది పెడుతుంటే ఆ స‌న్నివేశాలు, అలాగే అమ్మాయి ప్రేమ కోసం అబ‌ద్దాలు ఆడే ప్రేమికుడిగా నాని వేరియేష‌న్స్‌ను తనదైన నటనతో చ‌క్క‌గా ఎలివేట్ చేస్తూ వ‌చ్చారు. అలాగే చివరలో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాల్లోనూ భావోద్వేగాలను చక్కగా పండించారు నాని.ఇక లీలా థామస్ పాత్రలో నజ్రియా నజీమ్ సింప్లీ సూపర్బ్. తొలి తెలుగు సినిమానే అయినా కూడా మన తెలుగు అమ్మాయే అనేంతగా ఆ పాత్రకు యాప్ట్ అయ్యింది. పాత్రలో ఓ ఎమోషనల్ ఫీలింగ్‌ను క్యారీ చేసే పాత్ర‌లో త‌ను చేసిన న‌ట‌న ఆక‌ట్టుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక సీనియ‌ర్ న‌రేష్ సంప్ర‌దాయాలు, ప‌ద్ధ‌తులు అంటూ కొడుకుని ఇబ్బంది పెట్టే తండ్రి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. త‌న సీనియారిటీతో ఆ పాత్ర‌కు ప్రాణం పోశారు న‌రేష్‌. ఇక ఎమోష‌న‌ల్ మ‌ద‌ర్ రోల్‌లో రోహిణి ఒక వైపు న‌దియా మ‌రో వైపు బ్యాలెన్స్ చేస్తూ వ‌చ్చారు. ముఖ్యంగా భ‌ర్త‌కు ఎదురు చెప్ప‌లేని ఓ స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ పాత్ర‌లో రోహిణి న‌ట‌న మెప్పిస్తుంది.

Share This Article