‘కాంతార’ రివ్యూ

Telugu Box Office

చిత్రం: కాంతార: లెజెండ్‌; నటీనటులు: రిషబ్‌ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్‌ తదితరులు; కూర్పు: కె.ఎమ్‌.ప్రకాష్‌, ప్రతీక్‌ శెట్టి; సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌; ఛాయాగ్రహణం: అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌; కథ, దర్శకత్వం: రిషబ్‌ శెట్టి; నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్‌; విడుదల తేదీ: 15-10-2022

‘కాంతార’.. కొన్ని రోజులుగా సినీప్రియుల కళ్లన్నీ ఈ కన్నడ చిత్రంపైనే ఉన్నాయి. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. ‘కేజీయఫ్‌’ సిరీస్‌ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. గత నెలలో కన్నడలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ కూడా దీన్ని ఓ కన్నడ క్లాసిక్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రభాస్‌, ధనుష్‌ వంటి స్టార్లు సైతం సినిమా చూసి మనసు పారేసుకున్నారు. దాంతో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లోనూ డబ్‌ చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌. శనివారం విడుదలైన ‘కాంతార’ సినిమా ఎలా ఉంది… తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? అన్నది రివ్యూలో చూద్దాం…

కథేంటంటే
‘కాంతార’ కథ 1847లో ప్రారంభం అవుతుంది. వేల కోట్ల సంపద, మంచి కుటుంబం ఉన్నా ఓ రాజుకు ప్రశాంతత మాత్రం లభించదు. కావాల్సినవన్నీ ముందున్నా.. ఏదో లోటు ఉందని మదన పడుతుంటాడు. ఓ స్వామిజీ సూచన మేరకు ప్రశాంతత కోసం ఒంటరిగా వెళ్తాడు. ఏ ప్రదేశానికి వెళ్లినా ఆయన మనసుకు ప్రశాంతత లభించదు. చివరిలో ఓ అడవిలోకి వెళ్తుండగా.. అక్కడ ఓ దేవుడి శిల ముందు ఆగిపోతాడు. అది చూడగానే మనసు తేలికైపోతుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దీంతో ఆ దేవుడి శిల తనకు కావాలని అక్కడి ప్రజలను కోరతాడు. దానికి బదులుగా ఏం కావాలన్నా ఇస్తానంటాడు.

ఆ సమయంలో దైవం ఆవహించిన ఓ మనిషి రాజుకు ఓ షరతు విధిస్తాడు. దేవుడికిచ్చిన భూమిని తిరిగి లాక్కునే ప్రయత్నం చేయకూడదని, మాట తప్పితే దైవాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తాడు. అయితే రాజు తదనంతరం ఆయన తనయుడు మాట తప్పుతాడు. తన తండ్రి దానమిచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించగా.. కోర్టు మెట్లపై రక్తం కక్కుకొని చనిపోతాడు. అక్కడ సీన్ కట్‌ చేస్తే.. 1990లో ఆ అటవీ భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ప్రజలు ఆక్రమించుకున్నారని సర్వే చేయిస్తుంటాడు ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళి(కిశోర్‌ కుమార్‌). ఈ నేపథ్యంలో ఆ ఊరి యువకుడు శివ(రిషబ్‌ శెట్టి)కి, మురళికి గొడవలు జరుగుతాయి. తమకు అండగా రాజ వంశీకులు దేవేంద్ర దొర(అచ్యుత్‌ కుమార్‌) ఉంటాడని శివతో పాటు ఆ ఊరంతా నమ్ముతుంది. మరి దేవేంద్ర దొర ఏం చేశాడు? ఆ ఊరిలో కోలం ఆడే దేవ నర్తకుడు గురవను హత్య చేసిందెవరు? శివ కలలో కనిపించే ఆ రూపం ఎవరిది? అటవి భూమిని, దానిని నమ్ముకొని బతుకుతున్న ప్రజలను కాపాడడం కోసం దేవుడు ఏం చేశాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే…

‘కంతార’ లైన్‌గా వింటున్నప్పుడు చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకంగా తెరకెక్కించారు. అందుకే ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచిస్తుంది. ఓ వినూత్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి కదలకుండా కూర్చోబెడుతుంది. మట్టిపరిమళాలు అద్దుకున్న కథనం.. దాంట్లోకి దైవత్వాన్ని జొప్పించిన తీరు.. కథలో నుంచి పుట్టిన సహజమైన పాత్రలు.. ఆయా పాత్రల్లో పండే సున్నితమైన హాస్యం.. గుండెతడి చేసే భావోద్వేగాలు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే పోరాటాలు.. ప్రతిదీ సినీ ప్రియుల్ని కట్టిపడేస్తుంది. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కథంతా కన్నడ ఫ్లేవర్‌లో సాగుతుంది. అయినప్పటికీ అన్ని ప్రాంతాల ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యే కథ ఇది. అడవి ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారు? వారి అలవాట్లు ఎలా ఉంటాయి? వేటాడే విధానం ఎలా ఉంటుంది? ఇలా ప్రతి అంశం కళ్లకు కట్టినట్లు చూపించారు. మొరటు ప్రేమ, కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. అయితే వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి సీన్స్‌ ఉండవు.. కథలో భాగంగా సాగుతాయి. దేవ నర్తకుడు కోలం ఆడే ప్రతి సీన్‌ ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నీవేశం చాలా నేచురల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌ వరకు ఇది సాధారణ సినిమానే. సెకండాఫ్‌ స్టార్టింగ్‌లో కొంత నెమ్మదిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్‌ మాత్రం సినిమా స్థాయిని పెంచేస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు రిషబ్‌ శెట్టి తన విశ్వరూపాన్ని చూపించాడు. థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి రిషబ్‌ శెట్టి ఒక్కడే అలా గుర్తిండిపోతాడు.

ఓవైపు నటుడిగా.. మరోవైపు దర్శకుడిగా సినిమాకి ప్రాణం పోశాడు రిషబ్‌ శెట్టి. ఆయన నటన.. దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. పతాక సన్నివేశాల్లో ఆయన నటన శివతాండవంలా ఉంటుంది. సినిమా పూర్తిగా కన్నడ నేటివిటీలో సాగినా.. ఇందులోని భావోద్వేగాలు అన్ని భాషల ప్రేక్షకులకూ కనెక్ట్‌ అవుతాయి. కథలో వచ్చే ట్విస్ట్‌ను ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే నాయకానాయికల ప్రేమకథ మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. నాయికగా సప్తమి గౌడ చాలా సహజంగా కనిపించింది. ఉద్యోగానికి.. ఊరి ప్రజలకు మధ్య నలిగిపోయే పాత్రలో చక్కటి నటన కనబర్చింది. హీరో స్నేహితుల బృందంలోని చాలా పాత్రలు గుర్తుండిపోయేలా ఉంటాయి. రాజ వంశీకుడు దేవేంద్ర దొరగా అచ్చుత్‌ కుమార్‌ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళిగా కిషోర్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర అద్భుతంగా నటించారు. అరవింద్‌ ఛాయాగ్రహణం, అజనీష్‌ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కేవలం రూ.16కోట్ల బడ్జెట్‌తోనే ఇలాంటి విజువల్ వండర్ తెరకెక్కించడం నిజంగా అభినందించదగ్గ విషయం.

Share This Article