రివ్యూ: మెప్పించని ‘లైగర్’

Telugu Box Office

Liger Review: చిత్రం: లైగర్‌; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విషు రెడ్డి, అలీ, మైక్‌ టైసన్‌; సంగీతం: సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనిష్‌ భాగ్చి; సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ; ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ; రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌; బ్యానర్‌: పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌; విడుదల తేదీ: 25-08-2022

విశ్లేషణః పూరి జగన్నాథ్‌ ముందు సినిమా ఇస్మార్ట్ శంకర్‌ భారీ విజయం సాధించడంతో పూరి మళ్ళీ పామ్‌లోకి వచ్చాడని అందరూ భావించారు. వెంటనే ప్యాన్‌ ఇండియా సినిమా లైగర్‌, విజయ్‌ దేవరకొండతో అనగానే కొంచెం అంచనాలు పెరిగాయి. దానికి తోడు కరణ్‌ జోహార్‌ లాంటి హిందీ దర్శకనిర్మాత ఈ సినిమాలో భాగం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ పూరి ఒక హిట్‌ వచ్చాక ఈ ప్యాన్‌ ఇండియా మోజులో పడి మళ్ళీ పాత పద్దతికే అలవాటు పడినట్లున్నాడు. ఇప్పుడు ప్రేక్షకులు కంటెంట్‌ లేకపోతే సినిమా హాల్‌కి రాలేని రోజులు ఇవి. ఇటువంటి సమయంలో పూరి కథ లేకుండా, సరైన స్ర్కీన్‌ప్లే లేకుండా, ఏదో నలుగురు హిందీ యాక్టర్స్‌ని ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ అయినా మైక్‌ టైసన్‌లాంటి వ్యక్తిని సినిమాలో చూపించి హిట్‌ అనుకుంటే పొరపాటే!

సినిమా మొదలవడం బాగానే ఉంది. కానీ కొద్ది నిమిషాలకే గాడి తప్పుతుంది. అసలు ఏమి జరుగుతోంది, పూరి ఏమి చెప్పాలనుకున్నాడు, కథలో ఏమి చూపిస్తున్నాడో అర్థం కాకుండా పోయింది. ‘లైగర్‌’ లక్ష్యం ఛాంపియన్‌ అవ్వాలని, కానీ పూరి ఆ నేపథ్యంలో ఏమి చూపించకుండా, చాలా సినిమాటిక్‌గా పది మంది రౌడీలను, తర్వాత కోచింగ్‌ సెంటర్‌లో ఇంకో 20 మందిని కొట్టగానే కోచ్‌ కి లైగర్‌ స్కిల్స్‌ నచ్చేస్తాయి. ఇంకేముంది ఛాంపియన్‌ అయిపోతాడు. సినిమాలో అన్ని సీన్స్‌ అందరూ ఊహించినట్లుగా ఉంది. విచిత్రం ఏంటంటే పూరి మార్క్‌ డైలాగ్స్‌ కానీ పూరి మార్క్‌ సీన్స్‌ కానీ ఎక్కడ కనపడవు. కథ ఏమి అనుకోకుండా తీసిన సినిమా ఇది అనిపిస్తుంది. తెలుగు వాళ్లకి ఇది ఒక డబ్బింగ్‌ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఏదో మిస్‌ అయినట్టు అనిపిస్తుంది. పలు సన్నివేశాల్లో ఓవర్‌ యాక్షన్‌లా అనిపిస్తుంది. ఎక్కడ ఎమోషన్‌ కనిపించదు. అసలు లైగర్‌ లక్ష్యం ఏంటి ఎందుకు అమెరికా వెళ్ళాడు అన్న విషయం పక్కన పెట్టి, సిల్లీగా తన ప్రియురాలు కోసం, మైక్‌ టైసన్‌తో ఒకే యాక్షన్‌ సీన్‌ పెట్టి సినిమా పూర్తి చెయ్యటం హాస్యాస్పదం. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ అన్ని విభాగాల్లో విఫలయ్యాడనే చెప్పాలి.

ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్‌ దేవరకొండ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నత్తిగా మాట్లాడే పాత్రతో మెప్పించాడు. అలాగే తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు అన్న సంగతి తెరపై కనిపిస్తోంది. కానీ అతను ఒక్కడే బాగా నటిస్తే సరిపోదు కదా, సరైన కథ, ఆసక్తికర కథనం, ఇవన్నీ చాలా అవసరం. కానీ ఈ చిత్రంలో అవేమీ లేవు. అనన్యా పాండేను కేవలం గ్లామర్‌ కోసం మాత్రమే తీసుకున్నట్లు అనిపిస్తుంది. రోనిత్‌ రాయ్‌ కోచ్‌గా ఓకే అనిపించాడు. విషు విలన్‌గా మెప్పించాడు. చుంకీ పాండే, అలీ లాంటి ఆర్టిస్ట్‌లు ఉన్నా వారి పాత్రలు ఏమాత్రం చెప్పుకొనేలా లేవు. మైక్‌ టైసన్‌ చివరలో కనిపిస్తాడు. రమ్య కృష్ణకి పెద్ద పాత్ర వచ్చింది. ఆమెని ఇంకా బాహుబలిలోని శివగామి పాత్ర వదిలినట్టు లేదు. లైగర్‌కు, రమ్యకృష్ణకు మధ్య ఎమోషన్‌ పండలేదు. ఇంకా సాంకేతిక పరంగా చూస్తే, యాక్షన్‌ సీన్స్‌ అన్నీ బాగున్నాయి, బాగా తీశారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పాటలు అంత ఆకట్టుకోలేదు. విజయ్‌ దేవరకొండ డాన్స్‌ చేస్తుంటే చూడటానికి ఏదోలా వుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక గుర్తుండే అంశం ఒక్కటీ లేదు. టోటల్‌గా చెప్పాలంటే లైగర్‌ విజయ్‌ దేవరకొండకి ఒక చెంప దెబ్బ లాంటిది. విజయ్‌ తదుపరి చిత్రం కూడా పూరి దర్శకత్వంలోనే ఉంది. కాబట్టి కథ మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. లేక ప్యాన్‌ ఇండియా అంటూ కథలు మార్చి, ఎక్కడెక్కడి నటినటుల్నో తెచ్చి కెమెరా ముందు నిలబెట్టి, విషయం లేకుండా లైగర్‌లా తీస్తే. అభాసుపాలు కావడమే అవుతుంది

చివరగా.. పూరి పాన్‌ ఇండియా మిస్‌ఫైర్‌ అయింది

Share This Article