సినిమాలపై ప్రేక్షకులకు విరక్తి కలిగింది.. అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్

సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం సవాలుగా మారిందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ (Ashwini Dutt) అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వినీదత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్‌ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్‌ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ విడుదలపై కూడా అశ్వినీదత్‌ స్పందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరితో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని, గ్రాఫిక్స్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. అవెంజర్స్‌ మూవీ స్థాయిలో ‘ప్రాజెక్ట్‌ కె’ ఉంటుందని అశ్వినీదత్‌ చెప్పారు.