భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన క్షేత్రం.. శ్రీశైలం

Telugu Box Office


మనదేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అని ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆదిపరాశక్తికి నవమరూపంగా భ్రమరాంబను ఆరాధించడం శాక్తేయులకు పరమ పవిత్రం. అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతణ్ణి సంహరించిన గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆదిశక్తి కొలువుదీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది. జ్యోతిర్లింగం, శక్తి పీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలసిన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సకల లోకారాధ్యంగా భాసిల్లుతోంది.\

లక్షా 47 వేల 456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో – ఎనిమిది శృంగాలతో అలరారే శ్రీశైలంలో 44 నదులు, 60 కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు, చంద్ర కుండ, సూర్యుకుండాది పుష్కరిణులు, స్పర్శవేదులైన లతలు, వృక్షసంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. గిరుల బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే మార్గం అత్యంత ఆహ్లాదకరం. పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతి లింగం, పంచపాడవ లింగాలు పూజలందుకుంటున్నాయి.

దేశంలో మరే క్షేత్రానికీ లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానికి ఉంది. పూజారంభంలో సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చొని తాము భగవదారాధనచేస్తున్నదీ విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. శ్రీశైల క్షేత్రం ఎప్పుడు వెలసిందీ స్పష్టంగా తెలియజేసే ఆధారాల్లేవు. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకొంది. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్ర వర్ణనలున్నాయి. ఆయా భాషల కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సమనోజ్ఞంగా అభివర్ణించారు.

64 అధ్యాయాలున్న స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది.ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి, ‘శివానంద లహరి’ని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలు అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు ‘గురు చరిత్ర’ చెబుతోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించి, కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు.

కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడనీ, త్రేతా యుగంలో రామ చంద్రుడు రావణుణ్ణి వధించిన తరవాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి, సహస్రలింగాల్ని ప్రతిష్ఠించి, ఆర్చించాడనీ ప్రతీతి. ద్వాపరయుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉంది.

స్కాందపురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన కథ ఉంది. శిలాథుడు అనే మహర్షికి నంది, పర్వతుడు అనే ఇద్దరు కుమారులుండేవారు. వారు శివభక్తి పరాయణులు. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుని శివదీక్ష స్వీకరించి, కఠోర తపస్సు చేశారు. వారి భక్తి కైలాసపతి మనస్సును కరిగించింది. స్మరణ మాత్రం చేత ఆపన్నుల భారాల్ని స్వీకరించే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తెరచిన కన్నుల ఎదుట త్రినేత్రుణ్ణి దర్శించిన ఆనందంతో నంది పరవశుడయ్యాడు. పశుపతికి వాహనంగా నిలిచిపోవాలన్న మనోభీష్టాన్ని వ్యక్తం చేశాడు. తాండవప్రియుడు ‘తథాస్తు’ అనడంతో నందికి నిఖిలేశ్వరుడికి వాహనమయ్యే యోగం సంప్రాప్తించింది. రెండో భక్తుడైన పర్వతుడు సైతం పరమేశ్వర సాక్షాత్కారానికి పరవశుడయ్యాడు. క్షణమాత్ర దర్శనభాగ్యం వల్లనే కొండంత ఆనందం పొందిన పర్వతుడు, దాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పించాడు. ఆదిదంపతులైన ఉమామహేశ్వరులు తనపై అన్నివేళలా కొలువుదీరి ఉండాలని వరం కోరుకుని కొండగా మారిపోయాడు. ఆ విధంగా శిలాథుడి రెండో కుమారుడైన పర్వతుడే ఈ శ్రీశైల శిఖర రూపుడని స్కాందపురాణం చెబుతోంది. మొదట్లో శ్రీపర్వతం అని పిలిచేవారనీ, కాలక్రమంలో అది శ్రీశైలంగా మారిందనీ అంటారు.

క్రీస్తు పూర్వం నుంచి అనేక రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్లు శిలాశాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు వర్ణిస్తున్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతుడైన మల్లికార్జునుణ్ణి దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించి, అశేష వస్తుసంపదలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి. బౌద్ధయుగంలో మహాయానానికి పూర్వం నుంచీ ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది. చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్‌ గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి ఉంది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14 శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాప రుద్రుడి శాసనమే ప్రాచీనమైనది. అది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది.

అనేక ప్రత్యేకతలున్న శ్రీశైల ఆలయానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపురసుందరి వెలసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగానూ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో జోగులాంబ విరాజిల్లే శక్తిపీఠమైన ఆలంపూర్‌ పశ్చిమ ద్వారంగానూ, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువుతీరిన సిద్ధవటం దక్షిణద్వారం గానూ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఉమామహేశ్వరాన్ని ఉత్తర ద్వారంగానూ భావిస్తారు. ఇవి కాకుండా ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి.

శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు. గిరిపంక్తుల్ని దాటి వెళ్తుంటే ఆలయానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖర దర్శనం సర్వపాపహరణమని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభాకారుడు కేశప్పను స్వర్ణలింగ రూపంలో శివుడు అనుగ్రహించిన హటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసిన పాలధార, పంచధారలు, తన జననీ జనకుల్ని దర్శించవచ్చిన వారి మోక్షార్హతను నిర్ధరించే సాక్షి గణపతి, కుంతీసుత మధ్యముడైన భీమసేనుడి గదాఘాతంతో ఏర్పడిందని భావించే ‘భీముని కొలను’ ఇలా శ్రీశైల యాత్రలో విధిగా సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడి నందీశ్వరుడి ప్రస్తావన ఉంది. ‘శనగల బసవన్న’ అని పిలిచే ఈ పశుపతి వాహనం కలియుగాంతంలో పెద్ద రంకె వేస్తాడని బ్రహ్మంగారు పేర్కొన్నారు.

శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లాలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 214 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.

Share This Article